
సూర్యుడు తన తాపాన్ని తగ్గిస్తూ, ఎత్తైన కొండలవెనుక చేరి, నెమ్మదిగా దాక్కుంటూండగా, ఎంతో ప్రశాంతంగా పారుతున్న సెలయేటిని చూస్తూ తన భార్యతో గడిపిన ఎన్నో మధురజ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ, సెలయెటీమధ్యలోనున్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని, స్కూల్నుండి తిరిగివచ్చే తన కూతురు మీనా కోసం ఎదురుచూస్తున్నాడు రఘు.
ఎప్పటిలానే మీనా తన స్కూల్ నుండి నడుచుకుంటూ, తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ వస్తుంది. దూరంగా మీనాని చూసిన రఘు, ఆతురతగా బండదిగి, సెలయేటిమీదుగా తన కూతురువైపు పరుగులు తీశాడు.
రఘు, అరుణలది ప్రేమ వివాహం. పెద్దలని ఎదురించి పెళ్ళి చేసుకున్నారు. పెద్దలని కాదని, రఘుతో కలిసి ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఒక చిన్న ప్రాంతం లో కాపురం మొదలుపెట్టారు. రఘు, ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న, ఒక టూరిస్ట్ గెస్ట్ హౌస్ లో వంట మనిషి గా పని చేస్తూ, తన జీవనాన్ని కొనసాగిస్తూ, ఆ ఊరులో మరియు, ఆ గెస్ట్ హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా వాళ్ళకి ఒక సంవత్సరం తరువాత, మీనా పుట్టింది. మీనాకి మూడేళ్లు ఉండగా, అనుకోకుండా రఘు భార్య, అరుణ కోవిడ్-19 కి గురై చనిపోయింది.
రఘు చిన్న వాడే, కానీ అనుభవాలు పెరిగిపోయాయి. ఎంతటికష్టమైనాతట్టుకునేమనిషి. కానీ అరుణని కోల్పోయిన తర్వాత, అతని నవ్వు అంతకుముందులానే ఉన్నా, ఆలోచనలవెనుకనీడలుకనిపించేవి.
రఘు కి ఉన్న ఏకైక ఆధారం మీనా. అతనికూతురు, అతనిగుండెచప్పుడు. మీనా చిన్నదే, కానీ తెలివితేటలు ఎక్కువ. కళ్లల్లోఅమాయకత్వం, మాటల్లో మాధుర్యం. “నాన్నా, నా hair style బాగుందా?” అని ప్రతిరోజూ ప్రశ్నించే అలవాటు. నువ్వు ఆ hair style చేయకముందు కూడా ఆనందంగానే ఉంటావు నా చిట్టి తల్లి అనేవాడు రఘు.
ఆ రోజు రాత్రి, రఘు మీనా ని తన గుండెలపై వేసుకొని పడుకోబెడుతూ, ఈ ఊరులో అంతా బాగుంది. మంచి ఇరుగుపొరుగువారు, చక్కటి ఉద్యోగం, కానీ మీనా కి స్కూల్ కి వెళ్లి వచ్చేటప్పుడు ఇబ్బంది గా ఉంది. వర్షాకాలంలో సెలయేటి జోరు ఇంకా పెరుగుతుంది, ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీనా స్కూల్ కి వెళ్లి రావటం కష్టంగా ఉంటుంది అని, ఊరు విడిచి వెళ్లడం మంచిదని ఆలోచనలతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఇంకా ఉంది…
Part-2 ఇక్కడ చదవండి