
నిశ్శబ్ద పోరాటం – Part 2
రఘు అనుకున్నట్లుగానే, మీనాని తీసుకుని దగ్గర్లో ఉన్న ఊరుకి తన మకాం మార్చాడు. కొత్త ఊరు చిన్నదే అయినా, ఇరుగుపొరుగువాళ్ళు అంతగా కలుపుగోలుగా ఉండకపోయినా, కేవలం మీనా స్కూల్ కి దగ్గర కదా అని రఘు అక్కడే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా, ఆ ఊర్లో వాళ్ళు అంతా రఘు ని, మీనని ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. వాళ్ళ చూపుల్లో ఏముందో రఘు కి అర్ధం కాలేదు అప్పుడు.
రఘు తాను పనిచేసే గెస్ట్ హౌస్ లో ఉద్యోగం మానేసి, కొత్తగా వెళ్లిన ఊరుకి అనుకుని ఉన్న కొండలోయలో అప్పుడప్పుడు అధికారులు stay చేయటానికి ఉన్న ఒక ప్రభుత్వ guest house లో పనికి చేరాడు. ఇక్కడ తాను చక్కగా రోడ్ మీద సైకిల్ తొక్కుకుంటూ, మీనాని స్కూల్ కి తీసుకుని వెళ్లొచ్చు, సెలయేళ్ళు, గుట్టలు దాటాల్సిన పని లేదు అని, ఆ ఊరు తనకి, మీనాకి సురక్షితం అని నమ్మాడు. అది అతని అర్ధం లేని నమ్మకం అని అతనికి అప్పుడు తెలియలేదు.
ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఎప్పటిలానే రఘు మీనా ని స్కూల్ లో వదిలి, తన సైకిల్ మీద పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఎప్పటిలానే స్కూల్ అయిపోగానే, గేట్ దగ్గర, గట్టుమీద రఘు కోసం ఎదురుచూసే మీనా, ఆ సాయంత్రం రఘు కి కనిపించలేదు. కంగారుగా అంతా వెతికాడు. అటు ఇటు పరిగెడుతూ, కనిపించిన వాళ్ళందరిని అడిగాడు. అందరూ ఒకటే సమాధానం. మేము చూడలేదు అని.
రఘు తనకి వీలైనంత వేగంగ తన సైకిల్ ని తొక్కుతూ, రోడ్ కి అటు ఇటూ వెతుక్కుంటూ, ఇంటికి చేరుకున్నాడు. అది చలికాలం, పైగా సముద్రమట్టానికి రమారమి 900 మీటర్లు ఎత్తులోవున్న కొండలోయ, ఉష్ణోగ్రతలు అప్పుడప్పుడే 18డిగ్రీస్ ని తాకుతుంది, అయినా రఘు షర్ట్ మొత్తం తన చెమటతో తడిసిపోయింది, తన నుదుటిమీదనుండి చమట నీరులా కారుతుంది. ఇంటికి చేరుకున్న రఘు ఆతురతగా లోపలికి వెళ్ళాడు కానీ తలుపులు వేసే ఉన్నాయి, పక్కింటివాళ్ళని అడగగా, నీతో రాలేదా అని అడిగేసరికి, రఘు కి ఒక్కసారిగా భూమి తలక్రిందులైనట్లు అనిపించి కుప్పకూలిపోయాడు. ఒక్క క్షణం ఉపిరిపీల్చుకోలేకపోయాడు, ఎక్కడ ఉంది నా బిడ్డ? ఎవరు తీసుకెళ్లారు? ఏమైపోయింది అని ఇలా ఆలోచించిస్తున్నాడు కానీ తన నోటినుండి ఒక్క మాట కూడా రావటం లేదు.
ఊరు ప్రజలు అంత తన చుట్టూ చేరారు, తననే చూస్తున్నారు. కానీ కొందరి చూపుల్లో మాత్రం ఎదో రహస్యం దాగిఉంది, రఘు ఎన్నోరకాలుగా ఆలోచిస్తున్నాడు, ధైర్యవంతుడు అయినప్పటికీ, తన ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోతున్నాడు, ఆగ్రామస్థుల కళ్ళు చెప్పే రహస్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. నేలమీదనుండి లేవటానికి ఎంత ప్రయత్నిస్తున్నా లేవలేకపోతున్నాడు.
అది ఒక రాత్రి, రఘు జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన రాత్రి. రఘు మల్లి తన బిడ్డని కలగలడా? మీనా మల్లి ఎప్పటిలానే తన తండ్రి గుండెలమీద పడుకోగలదా?
ఇంకా ఉంది.